కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ - పవన్ కల్యాణ్ పై జగన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 9:02 PM IST
CM Jagan Allegations on Opposition Parties:సామాజిక పింఛన్లను 3 వేలకు పెంచి, అభాగ్యులను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పెన్షన్ల కింద 64లక్షల 34వేల మందికి నెలకు 2 వేల కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా, అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. కాకినాడలో వైఎస్ఆర్ పింఛన్ కానుక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అడుగడుగునా అవినీతి జరిగిందని జగన్ విమర్శలు గుప్పించారు.
వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని సీఎం జగన్ విమర్శించారు. పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కేంద్రానికి లేఖ రాయడంపై, జగన్ నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణి చేశామని తెలిపారు. ఇరవై రెండు లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించని పవన్, తాను 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 22లక్షల ఇళ్లు కడుతుంటే, అవినీతి జరిగిందంటూ పవన్ కేంద్రానికి లేఖ రాస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పొత్తులు పెట్టుకుని కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని జగన్ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.