Clash Between YSRCP Leaders: చీరాల వైఎస్సార్సీపీలో ఘర్షణ.. ఎమ్మెల్యే వర్గీయులు, మాజీ ఎమ్మెల్యే వర్గీయులపై దాడి
Clash Between YSRCP Leaders in Chiralaa : 'ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడటం ఎంత కష్టమో' ఒకే పార్టీలో రెండు వర్గాల వారు కలిసి పని చేయడం కూడా అంతే కష్టం. బాపట్ల జిల్లాలోని ఓ నియోజకవర్గంలో అదే పరిస్థితి నెలకొంది. ఆఖరుకు దాడులు చేసుకొనే వరకు వెళ్లారు.
బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్సార్సీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు వివాదాలకు దారి తీసింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి వర్గీయులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు మధ్య శుక్రవారం తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ఒక గ్రూపులో ఆమంచి అనుచరుడు, 31వ వార్డు కౌన్సిలర్ ఎస్.సత్యానందం ఆమంచి కృష్ణమోహన్ గురించి ఓ పోస్టు పెట్టాడు. దీనికి కరణం వర్గానికి చెందిన వ్యక్తి కౌంటర్ సమాధానం ఇచ్చాడు. ఇలా వీరిద్దరి మధ్య కొద్ది సేపు గ్రూపులో మాటల యుద్ధం నడిచింది. అనంతరం పేరాల కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న తనపై 7వ వార్డు కౌన్సిలర్ ప్రోద్బలంతో కరణం వర్గీయులు కొంత మంది కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారని బాధితుడైన సత్యానందం తెలిపారు. చికిత్స కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి రాగా అక్కడ కూడా తమపై కొందరు గందరగోళం సృష్టించారని బాధితుడు తెలిపారు. కౌన్సిలర్పైనే దాడి చేస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వాపోయారు. ఈ మేరకు బాధితుడు సత్యానందం పోలీసులకు ఫిర్యాదు చేశారు.