కర్నూలు జిల్లాలో.. రసాభాసగా మహాత్మా జోతిరావు ఫూలే జయంతి వేడుకలు... - వైసీపీ వార్తలు
Jyoti Rao Phule Jayanti celebrations: బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అవమానిస్తోందని.. బీసీ సంఘాల నాయకులు కర్నూలు జిల్లాలో ఆరోపించారు. మహాత్మా జోతిరావు ఫూలే జయంతి సందర్భంగా.. నగరంలోని బిర్లా సర్కిల్ లోని ఆయన విగ్రహానికి కలెక్టర్ సృజన, మేయర్ బీవైరామయ్య, ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ తదితరులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో.. బీసీ సంఘాల నాయకులు రాంబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోతిరావు ఫూలే విగ్రహాన్ని మూలనపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ ఓట్లతో గెలిచిన మంత్రి గుమ్మనూరు జయరాం కనీసం ఒక్కసారి కూడా పూలే కార్యక్రమానికి హాజరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో బీసీ నేత నక్కలమిట్ట శ్రీనివాసరావుకు కూర్చోవటానికి కుర్చీ లేకుండా అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. మేయర్ బీవై రామయ్య ఎంత చెప్పినా, బీసీ నేతలు వినిపించుకోలేదు. కలెక్టర్, ప్రజాప్రతినిధుల ఎదుటే నేతల ఆరోపణలతో సభ అంతా గందరగోళంగా మారటం తీవ్ర చర్చనీయాంశమైంది.