యూనివర్సిటీ విద్యార్థుల మధ్య చిచ్చు రేపిన పుట్టినరోజు వేడుకలు - బాణసంచా కాల్చడంతో ఘర్షణ - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 12:31 PM IST
|Updated : Dec 7, 2023, 1:10 PM IST
Clash Between Students at Dr BR Ambedkar University:పుట్టినరోజు వేడుకలలో బాణాసంచా కాల్చడంతో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన ఘటన శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వర్సిటీలోని వంశధార వసతిగృహంలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధి పుట్టిన రోజు వేడుకలు మంగళవారం రాత్రి వసతిగృహ ఆవరణలో నిర్వహించారు. దీంతో పలువురు విద్యార్థులు బాణసంచా కాల్చారు. పీజీ, న్యాయశాస్త్రం కోర్సుల సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండటంతో ఆయా విభాగాల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.
అర్ధరాత్రి వేళ ఎందుకు ఇలా చేస్తున్నారని ఇంజినీరింగ్ విద్యార్థులను ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం అయ్యి ఘర్షణకు దిగారు. ఈ విషయమై చీఫ్ వార్డెన్ ఎస్.ఉదయభాస్కర్‌ను సంప్రదించగా పుట్టిన రోజు వేడుక కారణంగా తలెత్తిన వివాదం తగాదాకు దారి తీసిందన్నారు. దీనిపై విచారణకు ప్రధానాచార్యులు, విభాగాధిపతులు, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులతో ఉప కులపతి నిమ్మ వెంకటరావు కమిటీ వేశారని తెలిపారు. ఇరువర్గాలకు చెందిన 27 మంది విద్యార్ధులు ఈ వివాదంలో ఉన్నట్లు గుర్తించి నివేదికను వీసీకి అందజేశామని చెప్పారు. ఆయన నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.