ఆలయానికి వెళ్లకుండా జేసీ బ్రదర్స్‌ను అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాదం - jc brothers house arrest
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ సోదరులను పోలీసులు గురువారం గృహ నిర్బంధం చేశారు. ఆలూరు కోనరంగనాథ స్వామి ఆలయంలో రథోత్సవానికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అదే సమయంలో ఉత్సవాలకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తున్నందున గొడవలు జరిగే అవకాశాలున్నాయనే నెపంతో వారిని అడ్డుకున్నారు. జేసీ సోదరులను పోలీసులు పలు మార్లు అడ్డుకోవటంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, పోలీసులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీసుల మధ్య తోపులాట జరిగింది. గంట తరువాత ఉత్సవాలకు పంపుతామని సీఐ ఆనందరావు నచ్చచెప్పడంతో జేసీ వెనుదిరిగారు. జాతరకు వెళ్లకుండా తమను అడ్డుకోవటం సరికాదన్నారు. గుడికి, బడికి పోవాలంటే ఆంక్షలు విధిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు పొద్దున పోలీసులు, ప్రజల కుటుంబాలకు ఇదే వర్తింస్తుందా అని ప్రశ్నించారు. అనంతరం పోలీసులు ఉత్సవాలకు అనుమతి ఇవ్వడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆలూరు గ్రామానికి వెళ్లారు. అక్కడ జేసీ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికారు.