Clash Between Janasena, YSRCP Activists: అవనిగడ్డలో జనసేన నేతలపై వైసీపీ నేతలు దాడి..ఉద్రిక్తత - Clash between Janasena YSRCP workers
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 20, 2023, 5:02 PM IST
Clash Between Janasena, YSRCP Activists: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు పార్టీ అండదండలతో రెచ్చిపోతున్నారు. శాంతియుతంగా నిరనస తెలుపుతున్న ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నేరవేర్చాలంటూ.. నిరసనకు దిగిన జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంఘటన సంచలనంగా మారింది.
అసలు ఏం జరిగిందంటే..కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. గత ఏడాది అవనిగడ్డ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన..'అవనిగడ్డ-కోడూరు రోడ్డు నిర్మాణం, పాత ఎడ్లలంక బ్రిడ్జి, డయాలసిస్ సెంటర్, పట్టణంలో సీసీ డ్రైన్ నిర్మాణం, దివిసీమ కరకట్ట మరమ్మతులకు రూ.100 కోట్ల కేటాయింపుల' హామీలు ఇప్పటికీ నెరవేరకపోవడంపై.. తెలుగుదేశం, జనసేన నేతలు మహాధర్నాకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మహాధర్నాకు అనుమతి లేదంటూ తెలుగుదేశం, జనసేన నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా, నిరసనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఈ నేపథ్యంలో కొందరు జనసేన కార్యకర్తలు పోలీసు వలయాన్ని దాటుకుని.. వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలను వెంటబడి తరిమారు. అయితే, అక్కడే ఉన్న పోలీసులు.. ఇరుపక్షాల నేతలను చెదరగొట్టకుండా జనసేన నేతలనే అక్కడి నుంచి చెదరగొట్టడంపై జనసేన సైనికులు మండిపడ్డారు.