Clash Between Two Groups: స్థల వివాదం.. కర్రలు, రాళ్లతో ఇరువర్గాల దాడి.. పలువురికి గాయాలు
Clash Between Two Groups: ఒక్కోసారి మాటలతో పోయే గొడవలను.. తీవ్ర స్థాయికి తీసుకొని వస్తూ ఉంటారు. దీని కారణంగా ఇరువురూ నష్టపోతారు. అలాంటి ఘటనే వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది. వైయస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కమ్మవారిపల్లెలో దాయాదుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. కొమ్మినేని మాధవ, కొమ్మినేని సుబ్బయ్య వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఇంటి నిర్మాణాన్ని ఓ వర్గం చేపట్టడం.. మరో వర్గం అడ్డుకునే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య కర్రలు, రాళ్లతో దాడి జరిగింది.
దాదాపు పది మందికి పైగానే రెండు వర్గాలకు సంబంధించిన పురుషులు, మహిళలు సైతం పెద్దపెద్ద కర్రలు తీసుకొని కొట్టుకున్నారు. ఈ స్థలం వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఓ వర్గం వారు నిర్మాణాలు చేపట్టింది. దీంతో మరో వర్గం అభ్యంతరం తెలపడంతో.. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసినట్లు అయ్యింది. రెండు వర్గాల కర్రల దాడిలో పలువురు గాయపడటంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.