CII-AP chapter: విద్యుత్ ధరల కారణంగా రాష్ట్రంలో పరిశ్రమలకు ఇబ్బందులు: సీఐఐ - కరెంట్ బిల్లులు
CII-AP Chapter Chairman Lakshmi prasad: విద్యుత్ ధరల కారణంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని భారత పరిశ్రమల సమాఖ్య వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి నివేదిస్తున్నామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పరిశ్రమలకు అందించే విద్యుత్ యూనిట్ ధర 9 రూపాయల వరకూ ఉంటోందని, ఇది కచ్చితంగా భారమేనని సీఐఐ ఏపీ చాప్టర్ ఛైర్మన్ ఎం.లక్ష్మీ ప్రసాద్ స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో విద్యుత్ ధర అధికంగానే ఉందన్నారు. 2023-24 సంవత్సరానికి సీఐఐ రాష్ట్రంలోని పరిశ్రమలకు సంబంధించిన ప్రాధాన్యతా అంశాలపై ఆయన మాట్లాడారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం సీఐఐ పని చేస్తోందని లక్ష్మీ ప్రసాద్ స్పష్టం చేశారు. కొత్త పరిశ్రమలు, స్టార్టప్లకు సహకారం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు డిజిటలైజేషన్ ప్రక్రియను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని సీఐఐ సభ్యులు రామకృష్ణ వ్యాఖ్యానించారు. తద్వార ఉత్పత్తి వ్యయాలు తగ్గించుకోవటంతో పాటు ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా ఉత్పత్తిని మార్చుకునేందుకు వీలు కలుగుతుందని ఆయన వెల్లడించారు. మల్టీ డైమెన్షనల్ నైపుణ్యం, సామర్ధ్యాలు ఉండాలని ఆయన సూచించారు.