Chittoor ASP on Punganur Issue: పుంగనూరు ఘటనలో 62మంది అరెస్ట్.. - people arrested in punganur incident
People Arrested in Punganur Incident: చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని భీమగానిపల్లె వద్ద ఈ నెల 4వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన విధ్వంసంలో.. 62మందిని అరెస్టు చేశామని ఏఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు. అనుమతి లేకపోయినా చంద్రబాబు పర్యటనను రూట్‌మ్యాప్ మార్చి పుంగనూరులోకి తీసుకొచ్చి గొడవలు సృష్టించి.. పోలీసుల చేత కాల్పులు జరిపించాలని.. చల్లా బాబు కుట్రపన్నారని.. ఆమె తెలిపారు. ఈ కేసుల్లో మరికొంత మందిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.
"ఈ నెల 2వ తేదీన చల్లా బాబు.. టీడీపీ కేడర్ అందరితో మీటింగ్ పెట్టి.. 4వ తేదీన చంద్రబాబు పుంగనూరు పర్యటన ఉందని చెప్పారు. ఈ క్రమంలో ముందస్తుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కాకుండా ఆయనను మనం పుంగనూరు టౌన్లోకి తీసుకుని వెళ్లాల్సి ఉందని చెప్పారు. మనం తీసుకుని వెళ్లేటప్పుడు పోలీసులు అడ్డువస్తే.. వారి మీద దాడి చేయాలని అన్నారు. అలాంటి గొడవల్లో పోలీసులు కాల్పులు జరుపుతారని.. అప్పుడు టీడీపీ వాళ్లకు ఏమైనా ఐతే.. రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇమేజ్ వస్తుందని చల్లా బాబు చెప్పారు. ఈ ఉద్దేశంతోనే పోలీసులపై బీర్ బాటిల్స్, సోడాసీసాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది."- శ్రీలక్ష్మి, చిత్తూరు ఏఎస్పీ