Councillors fire on Officers: అధికారుల తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహం.. ప్రజలను వేధించవద్దన్న ఛైర్మన్ - చీరాలలో మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం
Chirala Municipal Councillors fire on Officers: అధికారులు చేసే తప్పిదాల వల్ల తమ పాలనకు చెడ్డపేరు వస్తుందని బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఛైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన చీరాల పురపాలక సంఘ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. హైస్కూలు రోడ్డులో ఉన్న మున్సిపల్ షాపుల్లో అద్దె ఎంత చెల్లిస్తున్నారు అని అధికారులను కౌన్సిలర్ అనిల్ కుమార్ వివరణ కోరగా సరైన సమాధానం రాలేదు. దీంతో సమావేశాల సమయంలో అన్నీ తెలుసుకొని రావాలని.. మున్సిపల్ సిబ్బందికి తెలియకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ అధికారుల తీరుపై కౌన్సిలర్లు మండిపడ్డారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అవినీతి వల్ల కౌన్సిలర్లకు చెడ్డపేరు వస్తుందని, ప్రజలకు చేయాల్సిన పనులు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలతో మంచిగా ఉండండి, వారిని వేధించవద్దు అని చెపుతుంటే.. దాన్ని అవినీతిగా మార్చుకుని తమ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చీరాల పురపాలక సంఘ కార్యాలయ అధికారులు తీరు మార్చుకోవాలని చైర్మన్ శ్రీనివాసరావు హెచ్చరించారు. చాలినంత సిబ్బంది ఉన్నా అధికారులు ప్రజలకు పనులు చేయటంలో జాప్యం చేస్తున్నారని, బాధ్యత మరచి ప్రవర్తించవద్దని హితవు పలికారు. సమావేశంలో కమిషనర్ రామచంద్రా రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.