Chirala Court Remands Margadarsi Manager: మార్గదర్శి మేనేజర్‌కు రిమాండ్ విధించిన చీరాల కోర్టు.. - Cases against Margadarsi
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2023, 11:02 AM IST
Chirala Court Remands Margadarsi Manager:బాపట్ల జిల్లా చీరాల మార్గదర్శి మేనేజర్‌కు వచ్చే నెల 5 వరకు చీరాల కోర్టు రిమాండ్ విధించింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరుకి చెందిన మార్గదర్శి చందాదారు సుబ్రహ్మణ్యం భార్య బి వేళాంగిణి ఫిర్యాదు చేశారంటూ చీరాల ఒకటో పట్టణ పోలీసులు మార్గదర్శి మేనేజర్‌పై ఆదివారం ఫోర్జరీతో పాటు పలు సెక్షన్ల కింద నేరం మోపి కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరారు. ఫోర్జరీ చేసినట్లుగా నిర్ధారించే డాక్యుమెంట్లు మంగళవారం కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో పోలీసులు సంబంధిత పత్రాలు మంగళవారం కోర్టు ముందుంచారు. మార్గదర్శి మేనేజర్‌కు రిమాండ్ కోరారు. అయితే సెక్షన్ 467 కింద ఫోర్జరీ నేరం మోపిన పోలీసులు ఆ డాక్యుమెంట్లపై ఉన్న సంతకం ఆయనదేనని సమర్ధించే ఫోరెన్సిక్ ల్యాబ్, చేతిరాతల నిపుణుల నుంచి ధ్రువీకరణలు ఏమీ లేవని మార్గదర్శి న్యాయవాది రమేష్‌బాబు వాదించారు. అవన్నీ దర్యాప్తులో తేలుతాయని న్యాయమూర్తి నిషాద్‌నాజ్ రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో మేనేజర్‌ను ఒంగోలు జైలుకు తరలించారు.