Arrangements for CM Sabha ఈ సారి అమలాపురం చెట్లు, వీధులు..! సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లలో అధికారులు - ముఖ్యమంత్రి పర్యటన
Arrangements for CM Sabha: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 26వ తేదీన అమలాపురంలో వైయస్సార్ చేయూత బటన్ నొక్కే కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లు ప్రజలను విస్తు పోయేలా చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వెళ్లే రహదారిలో చెట్ల కొమ్మలు నరికేయడం, రహదారులకు ఇరువైపులా బారికేడ్ల ఏర్పాట్లకు జరుగుతున్న పనులు ప్రజలు ముక్కున వేలేసుకునే విధంగా ఉన్నాయి. అమలాపురం పోలీస్ క్వార్టర్స్ దగ్గర సుమారు 30 కొబ్బరి చెట్లు తొలగించారు అక్కడ నుంచి హెలికాప్టర్ దిగి ఎన్టీఆర్ రోడ్డు మార్గంలో బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు సీఎం హాజరుకానున్నారు. దీంతో చెట్లు తొలగించడం, చెట్ల కొమ్మలు నరికేయడం పనులే కాకుండా ఎన్టీఆర్ మార్గంలో ఫుట్ పాత్ కోసం 20 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ కు సంబంధించి సిమెంట్ కాంక్రీట్ కర్బు వాల్ కు డ్రిల్లింగ్ మిషన్లతో హోల్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో బార్ కేడింగ్ ఏర్పాటు చేసేందుకు ఈ హోల్స్ పెడుతున్నారు. కర్బు వాల్ కు ఇలా పెట్టడం వల్ల అది బలహీన పడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ప్రజా సంక్షేమం కోసం చేసిన ఇలాంటి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి పర్యటన పుణ్యమా అని తూట్లు పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.