పల్నాడు జిల్లాలో చిరుత సంచారం.. భయాందోళనలో జనం - Cheetah in ntr district
Cheetah in Palnadu District : పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. పట్టణంలోని మాడుగుల రోడ్డులోని ఎడ్లపందాలు జరిగే ప్రదేశంలో జీయో సిగ్నల్ టవర్ దగ్గర చిరుతపులి ఉన్నట్లు సీసీ టీవీలో రికార్డు అయింది. చిరుత సంచరిస్తుందని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు స్థానికులను అప్రమత్తంచేసి.. అర్థరాత్రి గస్తీ నిర్వహించారు. చిరత సంచారంపై పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుతపులి సంచరిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. చిరుతపులి ఆనవాళ్లు చెదిరిపోవడంతో సీసీ పుటేజి దృశ్యాలను మార్కాపురంలోని పై అధికారులకు పంపించారు. సీసీ పుటేజీని పరిశీలించిన అధికారులు ఆ ప్రదేశంలో చిరుతపులి ఉన్నట్లుగా నిర్ధారించారు. ఆ చిరుత వయస్సు 4సంవత్సరాలుగా ఉన్నట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు. చిరుతపులి ఈప్రదేశంలో సంచరిస్తున్నది నిజమేనని మాచర్ల అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించగా... చెరువు దగ్గర చిరుతపులి కాలిముద్రను గుర్తించారు. ఆ చిరుత గత రెండు, మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నట్లుగా నిర్ధారించారు. మూగజీవాలను, పిల్లలను, వృద్ధులను అప్రమత్తంగా ఉండాలని, అటవీ అధికారులు తెలిపారు. ఒంటరిగా బయటకు రాకూడదని సూచించారు. ఆ చుట్టుపక్కల పలు ప్రదేశాల్లో అటవీ అధికారులు సీసీ పుటేజీలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. చిరుతపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.