Cheetah Migration in Vizag: విశాఖ శివారులో చిరుత పులి కలకలం.. భయాందోళనలో జనం - విశాఖ ఎండాడలో చిరుత సంచారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2023, 6:16 PM IST
Cheetah Migration in Vizag: అడవులు క్షీణించడం వల్ల అక్కడ నివసించే జంతువులు జనావాసాల్లోకి రావడం మనం తరుచూ చూస్తుంటాం. అలాంటి ఓ సంఘటనే విశాఖ నగర శివారు ప్రాంతమైన ఎండాడలో జరిగింది. ఎండాడలోని ఎంకే గోల్డ్ వద్ద చిరుత కనిపించటం స్థానికంగా ఉండే ప్రజల్లో కలకలం రేపింది. ఎంకే గోల్డ్‌కి సమీపంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డు.. తాను భోజనం చేసే సమయంలో ఆ పక్కన ఉన్న కొండ మీద నుంచి ఓ జంతువు రావడం గమనించానని తెలిపాడు. మొదట తాను ఆ జంతువు కుక్క అని అనుకున్నానని అతను పేర్కొన్నాడు. కానీ దగ్గరికి సమీపిస్తున్న కొద్ది అది చిరుతపులి అని తెలుసుకుని భయాందోళనకు గురైనట్లు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన ఆ సెక్యూరిటీ గార్డు.. చిరుతపులిని చూసిన విషయం గురించి స్థానికులకు తెలియజేశాడు. చిరుత సంచారంపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత పులి కోసం అటవీ అధికారులు తనిఖీ చేస్తున్నారు.