Cheetah Attack Boy Discharge: చిరుత దాడిలో గాయపడిన బాలుడు డిశ్చార్జ్ - కౌశిక్‌ను పరామర్శించిన టీటీడీ సుబ్బారెడ్డి
Cheetah Attack Boy Discharge in Tirupati : జూన్ 22న తిరుపతి-అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో గాయపడ్డ బాలుడు కౌశిక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్తున్న కౌశిక్‌పై (4) చిరుత దాడి చేసింది. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిపై దాడి చేసిన చిరుత.. పొదల్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలో భద్రతా సిబ్బంది కేకలు వేయడంతో విడిచిపెట్టింది. అనంతరం ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 14 రోజుల చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కౌశిక్‌ను టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరామర్శించారు. కౌశిక్ పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్కావడంతో అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయతోనే తమ బిడ్డ ప్రాణాలతో దక్కాడని బాలుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. స్వామి వారికి తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చిరుత దాడి జరిగిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని తమ బిడ్డను చిన్నపిల్లల అసుపత్రికి తరలించారని తెలిపారు. టీటీడీ సంపూర్ణ సహకారంతో మెరుగైన వైద్యం అందించారన్నారు.
అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్‌ను శ్రీవారే రక్షించారని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. అటవీ శాఖ సహకారంతో చిరుతను బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టామని ఛైర్మన్ తెలిపారు. నడకమార్గాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారన్నారు. స్వామి వారు బాలుడికి పునర్జన్మ ప్రసాదించారని తెలిపారు.