Chandrababu visited Sri Balaji Reservoir: చిత్తూరులో వైసీపీ నేతలు 1147 ఎకరాల చెరువులను ఆక్రమించారు..: చంద్రబాబు
Chandrababu Naidu visited Sri Balaji Reservoir: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పర్యటన అడుగడుగునా అడ్డంకులతో కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడి పర్యటనను అడ్డుకునేందుకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు విధ్వంసాలు సృష్టిస్తున్నారు. అయినా కూడా వాటిన్నంటిని ఆధికమిస్తూ.. చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారు. ప్రాజెక్టుల సందర్శన అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దారుణాలను చంద్రబాబు వెల్లడిస్తున్నారు.
'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి'లో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లా రేణిగుంటలోని శ్రీ బాలాజీ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. అనంతరం చిత్తూరు జిల్లాలో 4 వేల 300 చెరువులు, వాటి కింద సుమారు 47 వేల ఎకరాల సాగుభూమికి అవకాశం ఉంటే.. జగన్ ప్రభుత్వం చెరువుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా 11 వందల 47 ఎకరాల్లో చెరువుల ఆక్రమణ జరిగిందని ఆరోపించారు. 75 ఎకరాల చెరువు విస్తీర్ణం పూడ్చి మరీ.. కబ్జా చేశారని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చాక చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ చేశారని మండిపడ్డారు. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో నీళ్లంటూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ అవినీతికి తెరలేపారని దుయ్యబట్టారు.
''అమరరాజా బస్సుపై వైసీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. వైసీపీ చేసే పనులతోనే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే అమరరాజా తెలంగాణకు తరలిపోయింది. ఇలాంటి దాడులు చూస్తే.. పరిశ్రమలు పెట్టేందుకు ఇంకెవరైనా వస్తారా..?. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ తర్వాత అత్యధికంగా దోపిడీకి పాల్పడింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే.''-చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
శాశ్వతంగా దరిద్రం పోతుంది: రుషికొండకు మకాం మారుస్తానంటున్న సీఎం జగన్.. నేరుగా ఇడుపులపాయకి వెళ్తే, రాష్ట్రానికి శాశ్వతంగా దరిద్రం పోతుందని.. చంద్రబాబు ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా ఆదివారం ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. శ్రీకాళహస్తి పర్యటన ముగించుకుని నెల్లూరు జిల్లాకు చేరుకున్న ఆయనకు.. జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా నెల్లూరు, ప్రకాశం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించి అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ఏర్పాట్లను ప్రకాశం జిల్లా తెలుగుదేశం నేతలు పరిశీలించారు. చంద్రబాబు భద్రత దృష్ట్యా సభను వేరేచోటుకు మార్చుకోవాలని పోలీసులు నేతలకు సూచించారు. ప్రకాశం పర్యటన ముగించుకున్న తర్వాత చంద్రబాబు.. రాత్రికి ఏలూరుకు చేరుకుంటారు. సోమవారం పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శిస్తారు.