Chandrababu Selfie Challenge: చింతలపూడి ప్రాజెక్టు వద్ద చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ - Chandrababu visit Chintalapudi Project
Chandrababu Selfie Challenge: చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. చింతలపూడి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తిచేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి పర్యటనలో భాగంగా 7వ రోజు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వివిధ ప్రాజెక్టులను చంద్రబాబు పరిశీలించారు. చింతలపూడి ఎత్తిపోతల వద్ద ఆయన సెల్ఫీ దిగారు. నీటి పంపింగ్ మోటార్ల స్థితిగతుల వివరాలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో 4 వేల 909 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. టీడీపీ హయాంలోనే 2 వేల 289 కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో 4 లక్షల 80 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు రూపకల్పన చేసామని అన్నారు. 53 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించేలా ప్రణాళిక చేశామని చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టును వైసీపీ అటకెక్కించిందన్నారు. దీనికి సమాధానం చెప్పాలంటూ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.