TDP Leaders Arrest: "అరెస్టు చేసి ఒత్తిడి తీసుకువచ్చి.. తప్పుడు స్టేట్మెంట్లపై సంతకాలు పెట్టిస్తున్నారు" - టీడీపీ నేతల అరెస్టు
Chandrababu Reacted on TDP Leaders Arrest: పుంగనూరులో తెలుగుదేశం కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు నిర్భందంలోకి తీసుకున్న పార్టీ నాయకులను కోర్టులో హాజరు పరచకపోవటమే కాకుండా.. వారిని హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతల అరెస్టులపై.. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. విచారణ పేరుతో అరెస్టు చేసి కస్టడిలోకి తీసుకుని.. హింసకు గురిచేస్తే అధికారులు తప్పక మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అరెస్టు చేసిన వారిపై ఒత్తిడి తీసుకువచ్చి బలవంతంగా తప్పుడు స్టేట్మెంట్లపై సంతకాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పుంగనూరులో రాజకీయ నేతలను సంతృప్తి పరచడానికి తప్పులు చేసే ప్రతి అధికారి.. తరువాత కాలంలో సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. అరెస్టైన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. వారికి పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇందుకోసం న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.