Buddha on Jagan: జగన్ కాలు మోపితే.. విశాఖకు విజయవాడ, గుంటూరు గతే: బుద్దా వెంకన్న - latest news on Chandrababu Visakhapatnam tour
ఈనెలలో ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన వివరాలను తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న వెల్లడించారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో బుద్ధా మాట్లాడారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో పెందుర్తి, ఎస్.కోట, అనకాపల్లి నియోజకవర్గాల్లో "ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి" కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పర్యటిస్తారని బుద్ధా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాలపై ఉత్తరాంధ్ర నుంచే తిరుగుబాటు మొదలవ్వాలని బుద్ధా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి.. ఎక్కడ అడుగు పెడితే అక్కడే అరిష్ఠమే అంటూ విమర్శించారు. అమరావతిలో అడుగు పెట్టారు.. విజయవాడ, గుంటూరు నాశనం అయ్యాయి అంటూ ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ నుంచి సీఎం వైజాగ్లో కాపురం పెడితే నాశనమే అని విమర్శించారు. విశాఖ నుంచి ఇచ్చాపురం వరకు భూ ఆక్రమణలు చేయడానికే సీఎం జగన్ విశాఖకు వస్తున్నారని బుద్ధా విమర్శించారు. రైతుల సమస్యలపై ప్రతిపక్ష నాయకుడు రోడ్లపై తిరుగుతుంటే.. సీఎం మాత్రం స్పందించడం లేదంటూ ఎద్దేవా చేశారు.