ఉచిత ఇసుక పాలసీ కేసు - చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ డిసెంబరు 6కు వాయిదా - AP High Court News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 30, 2023, 8:20 PM IST
Chandrababu Free Sand Policy Case : ఉచిత ఇసుక పాలసీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. సీఐడీ తరపున వాదనలు వినిపించేందుకు ఏజీ శ్రీరామ్ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను డిసెంబర్ 6కి న్యాయస్థానం వాయిదా వేసింది. ఉచిత ఇసుక పాలసీ విధానం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం చేకూరిందనే ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసింది.
ఇప్పటికే ఈ కేసులో పిటిషనర్ చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ద్ అగర్వాల్ గత విచారణలో వాదనలు వినిపించారు. ప్రజల కోసమే ప్రభుత్వం 2016లో ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చినట్టు గత విచారణలో కోర్టుకు తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ ద్వారా ఎవరూ వ్యక్తిగత లబ్ధి పొందలేదని వాదన వినిపించారు. ఇళ్లు కట్టుకునే వారికి అవసరం ప్రాతిపదికన ఇసుక సరఫరా జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు. బడా వ్యాపారులు, ఇతరులు సొమ్ము చేసుకోకుండా నియంత్రణ చేశామని స్పష్టం చేశారు.