Chandrababu Fires on YSRCP: ఇంటికో కర్ర పట్టుకుని.. వైసీపీ దొంగలను తరమాలి: చంద్రబాబు - అమలాపురంలో చంద్రబాబు రోడ్‌షో
Chandrababu Criticized CM Jagan on Development: సీఎం జగన్‌కు రంగులపై ఉన్న ప్రేమ అభివృద్ధిపై లేదని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు.. నాలుగున్నర సంవత్సరాలుగా చీకటి పాలన కొనసాగుతోందని.. ఏ ఒక్కరి పరిస్థితి సరిగా లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి దళితులంటే లెక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో దళితుల అభ్యున్నతికి 27 ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసినట్లు గుర్తు చేశారు. అవినీతి ముఖ్యమంత్రి అసమర్థ విధానాలతో ప్రజలపై భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుకాసురులు ఎక్కువయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అమ్మి భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చేశారన్నారు. విశాఖ, ఇతర నగరాలకు ఇసుక అక్రమంగా తరలిపోతోందని అన్నారు. రుషికొండకు కూడా గుండు కొట్టారని స్పష్టం చేశారు. తిరుమలలో పులులుంటే భక్తులకు కర్రలు ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంటికో కర్ర మాదిరి మళ్లీ పాత రోజులను తలపిస్తున్నారన్న చంద్రబాబు.. భక్తులు శ్రీవారిని చూడడానికి కాదు.. పులులను చంపడానికి వెళ్తున్నట్లుందన్నారు. కర్ర ఉంటే పులి పారిపోతుందంటున్నారని.. ఇంటికో కర్ర పెట్టుకుని వైసీపీ దొంగలను తరమాలని పిలుపునిచ్చారు. దోచుకోవడం పాలన కాదు.. సేవ చేయడం పరిపాలన అని చంద్రబాబు తెలిపారు.
స్థానికంగా ఉన్న సత్యనారాయణ గార్డెన్స్ నుంచి ప్రారంభమైన రోడ్ షో ఎన్టీఆర్ మార్క్ ఎర్ర వంతెన మీదుగా వెంకన్న బాబు గుడి వద్దకు చేరుకుంది. అక్కడ టీడీపీ అభిమానులు గజమాలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి పట్టణంలో గడియార స్తంభం వరకు కొనసాగింది. గడియార స్తంభం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రోడ్ షో ప్రారంభమైన దగ్గర్నుంచి.. చివరి వరకు టీడీపీ శ్రేణులు, మహిళలు చంద్రబాబుకు నీరాజనాలు పలికారు.