Chandrababu Condemned YSRCP Attack on Police Station: 'ఏపీలో పోలీసులకూ రక్షణ లేదు'.. పోలీస్ స్టేషన్‌పై వైసీపీ దాడిని ఖండించిన చంద్రబాబు
Chandrababu Condemned YSRCP Attack on Police Station: ఏపీలో పోలీసులకు కూడా రక్షణ లేని అరాచక పాలన కొనసాగుతోందని, మహిళా పోలీసుల దుస్తులు లాగుతూ ఈడ్చుకెళ్లడాన్ని అధికార పార్టీ నేతలు ఎలా సమర్థించుకుంటారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు అనంతపురంలోని ఎస్‌ఈబీ పీఎస్‌పై జరిపిన దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అక్రమ మద్యం కేసులో పట్టుబడిన వ్యక్తిని విడిచిపెట్టాలంటూ దాడి చేయటంపై మండిపడ్డారు. పోలీసులను చితకబాదడాన్ని పోలీసు పెద్దలు, పాలకులు ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. దాడిలో వైసీపీ కార్యకర్తలతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నేరగాడికి అధికారం ఇచ్చినందుకు భయం భయంగా బతకాల్సి వస్తోందన్నారు.
Lokesh Condemned YSRCP Attack on Police Station: వైసీపీ నేతల సైకోయిజానికి పరాకాష్ట... అనంతపురం సెబ్ పోలీస్ స్టేషన్ పై వైసీపీ సైకోల దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఎస్ఐ కుర్చీలో కూర్చుని.. అక్రమ మద్యం కేసులో పట్టుబడిన వ్యక్తిని వదిలి పెట్టాలి అంటూ పోలీసులపై దుర్బాషలాడటం వైసీపీ నేతల సైకోయిజానికి పరాకాష్ట అని మండిపడ్డారు. జగన్ పాలనలో మహిళా పోలీసులకే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. మహిళా పోలీస్ డ్రెస్ పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్లి, అడ్డొచ్చిన కానిస్టేబుల్‌ను చితకబాదిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనుచరుడు, వైసీపీ నేత సాకే చంద్రశేఖర్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.