cent land beneficiaries: 'సెంటు స్థలం పేరుతో.. ఉన్న ఇళ్లు లాక్కుంటున్నారు' - పట్టాల పంపిణీపై ఆందోళన
Cent land beneficiaries Protest: సెంటు స్థలాల పేరుతో ప్రభుత్వం పేదలు ఉంటున్న ఇళ్లను లాక్కునేందుకు యత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు ఆరోపించారు. రాజధానిలో పేద ప్రజలకు ఇచ్చిన సెంటు స్థలాలు వద్దని.. తాముంటున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని నులకపేట, సుందరయ్య నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు తాడేపల్లిలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకి సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. రాజధానిలో ప్రభుత్వం తమకు ఎలాంటి సౌకర్యాలు లేని స్థలాలు కట్టబెట్టిందని వారు ఆరోపించారు. అందులో ఉండేందుకు అనువుగా లేవని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నామని.. తాము నివాసం ఉంటున్న భూములకే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సెంటు స్థలం ఇచ్చిందని.. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు చెప్పారని లబ్ధిదారులు ఆరోపించారు. తమకు ఎవరైతే పట్టాలిస్తారో వారినే వచ్చే ఎన్నికలలో గెలిపిస్తామని ప్రజలు స్పష్టం చేశారు.