CBN Fire Minister Ambati Rambabu: 'నేను ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే.. మంత్రి రాంబాబు 'బ్రో' సినిమా గురించి మాట్లాడుతున్నాడు' - bro movie news
TDP chief Chandrababu harsh comments on minister Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ''నేను జలవనరుల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే.. ఆ శాఖ మంత్రి రాంబాబు 'బ్రో' సినిమా గురించి మాట్లాడుతున్నాడు. వీళ్లు మంత్రులేనా..? వీళ్లకు బుద్ధి ఉందా..? జ్ఞానం ఉందా..? వీళ్లంతా ఎక్కడికి పోతున్నారో అర్థం కావటం లేదు. సొంత కంపెనీలకు డబ్బులు దోచిపెట్టేందుకు మంత్రులంతా కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. నేను ఎంతో కష్టపడి ప్రాజెక్టులు నిర్మిస్తే.. వాటిని నాశనం చేస్తున్నారు'' అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
కొత్త ప్రాజెక్టుల పేరుతో జగన్ మరో దోపిడీకి తెరలేపారు.. ‘సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’ పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 1వ తేదీ నుంచి పది రోజులపాటు పర్యటన ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదటి రోజు పర్యటనలో నందికొట్కూరు ప్రాజెక్ట్, ముచ్చుమర్రి ప్రాజెక్టును సందర్శించారు. రెండవ రోజు గండికోట రిజర్వాయర్‌ను చంద్రబాబు సందర్శించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు వద్ద ఆగిన పనులను కొండలపైకి నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని ఈ సీఎం జగన్.. కొత్త ప్రాజెక్టుల పేరుతో మరో దోపిడీకి తెరలేపారని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కొత్తగా 10 ప్రాజెక్టులంటూ రూ.12వేల కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారని దుయ్యబట్టారు.