Cash Stolen From Old Woman: బ్యాంకుకు వెళ్లిన వృద్ధురాలి నగదు చోరీ.. ఫారమ్ కోసం వెళితే..!
Cash Stolen From Old Woman in Anantapur: బ్యాంకులో నగదు డిపాజిట్ చేయడానికి వెళ్లిన ఓ మహిళ బ్యాగు నుంచి 80వేల రూపాయలు నగదు చోరీకి గురైన ఘటన మంగళవారం అనంతపురం జిల్లాలో జరిగింది. గుంతకల్లు పట్టణంలోని భాగ్యనగర్‌కు చెందిన సావిత్రి తన కుమార్తెతో కలిసి స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లారు. నగదును డిపాజిట్ చేయడానికి ఫారంలో నోట్ల వివరాలను రాసి క్యాషియర్ వద్దకు వెళ్లారు. అందులో డబ్బు తక్కువగా ఉన్నాయని మరో ఫారం రాసుకురావాలని క్యాషియర్ చెప్పగా.. డబ్బును సంచిలో పెట్టుకుని దానికోసం వెళ్లారు. ఆ సమయంలో ఆమె చేతిలో ఉన్న బ్యాగ్‌ను బ్లేడ్‌తో కోసి అందులో ఉన్న రూ. 80వేలను చోరీ చేశారు. కొద్దిసేపటి తర్వాత సావిత్రి బ్యాగ్‌లో ఉన్న డబ్బులు తీసుకునేందుకు చేయి పెట్టగా కనిపించలేదు. డబ్బులు చోరీ అయినట్లు భావించి విషయాన్ని బ్యాంక్ అధికారులకు తెలిపింది. బ్యాంక్ సిబ్బంది వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బ్యాంక్‌లో ఉన్న వారిని బయటకు పంపాకుండా మొయిన గేట్‌కు తాళం వేసి అందరిని క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యాంక్‌లో ఉన్న సీసీ పుటేజ్ పరిశీలించారు. ఎనిమిదేళ్ల బాలిక బాధితురాలి నుంచి నగదు కాజేస్తున్న వీడియో చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామసుబ్బయ్య తెలిపారు.