ఆగని దొంగ ఓట్ల నమోదు - బనగానపల్లెలో బయటపడ్డ వైసీపీ సానుభూతిపరుల బాగోతం - బనగానపల్లెలో దొంగ ఓట్లు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 10:02 PM IST
Case Registered on Fake Votes Issue in Banaganapalli: రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక దగ్గర దొంగ ఓట్ల వ్యవహారం బయటపడుతోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు వందల కొద్దీ దొంగ ఓట్లను చేరుస్తున్నారు. టీడీపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నా.. వీటికి అదుపు లేకుండా పోతోంది. తాజాగా నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో దొంగ ఓట్ల బాగోతం బయటపడింది. భారీగా దొంగ ఓట్లు ఎక్కిస్తూ.. వైసీపీ నాయకులు, సానుభూతిపరులు అడ్డంగా దొరికిపోయారు. దీంతో దొంగ ఓట్ల చేర్పుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ సానుభూతిపరులు ఓట్ల జాబితాలో గుర్తు తెలియని వ్యక్తుల పేర్లు చేర్చినట్లు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఆన్‌లైన్‌లో దొంగ ఓట్లు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎలక్ట్రోరల్ ఆఫీసర్ కామేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఆన్‌లైన్‌లో దొంగ ఓట్లు నమోదు చేసిన పూజారి శ్రీనివాసులు సహా మరో 18 మందిపై చీటింగ్ సహా ఐటీ యాక్ట్ కింద బనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.