SI in ganja transport: గంజాయి అక్రమ రవాణా కేసులో ఎస్సై అరెస్ట్.. పరారీ? - అల్లూరి జిల్లా వార్తలు
Case registered on SI in ganja transport Case: గంజాయి రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకోవలసిన పోలీసు అతను. కానీ గంజాయి రవాణాకు సహకరించారు.. నిందితులను పట్టుకోకుండా వారితో బేరం కుదుర్చుకున్నారు. దీంతో గంజాయి రవాణాకు సహకరించారనే అభియోగాలపై అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం ఎస్సై సత్తిబాబుపై కేసు నమోదైంది. ఇటీవల ఎస్సై సత్తిబాబు ఆధ్వర్యంలో పోలీసులు గంజాయి లోడుతో వస్తున్న ఓ కారును పట్టుకున్నారు. నిందితులతో ఒప్పందం కుదుర్చుకుని ఎస్సై వారిని వదిలేశారు. అదే కారును నెల్లూరులో ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.. ఎస్సై సత్తిబాబు తమకు సహకరిస్తున్నారని నిందితులు తెలిపారు.
సెబ్ అధికారుల సమాచారంతో రంపచోడవరం ఏఆర్ పోలీసులు.. ఎస్సైను అదుపులోకి తీసుకుని రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే పోలీసుల కళ్లు గప్పి ఎస్సై అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు అనుమానిస్తున్నారు. గంజాయి కేసుల్లో ఎస్సై సత్తిబాబు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయని.. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.