ఏపీ గనుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ వీరప్రతాప్ రెడ్డిపై కేసు నమోదు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 8:54 PM IST
YSRCP Leader Veer Pratap Reddy:ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్, కడప జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేత వీరప్రతాప్ రెడ్డిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మైనింగ్ లీజుకు ఇప్పిస్తానంటూ రూ 14.50 లక్షలు తీసుకున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మైనింగ్ లీజు పేరుతో మోసం చేశాడంటూ తాడేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత జెక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనింగ్ లీజు ఇప్పించక పోగా డబ్బులు అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జెక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు, వీర ప్రతాప్ రెడ్డిపై నేడు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో తనకు తనకు గ్రానైట్ కంపెనీ ఉందని, అందులో వాటా ఇస్తానంటూ, వీర ప్రతాప్ రెడ్డి 2021లో 10 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని రోజుల తర్వాత తనను చీమకుర్తికి తీసుకెళ్లి ఓ గ్రానైట్ సంస్థను చూపించాడని, అందులో వాటా కోసం మరో రూ. 4.50 లక్షలు డిమాండ్ చేయగా ఫోన్ పే ద్వారా చెల్లించినట్లు బాధితుడు తెలిపాడు. ఏళ్లు గడుస్తున్నా గ్రానైట్ లీజ్ విషయంలో వీర ప్రతాప్ రెడ్డి స్పందించక పోవడంతో డబ్బులు ఇవ్వాలని అడిగితే, చంపేస్తానని బెదిరిస్తున్నారని జెక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదులో వెల్లడించారు.