సంగం డైరీపై కొనసాగుతున్న జగన్ సర్కారు చర్యలు - విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో డైరెక్టర్లు, ఉద్యోగులపై కేసులు - Guntur news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 11:27 AM IST
Case Filed on Sangam Dairy Directors Employees :తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ముగ్గురు సంగం డెయిరీ డైరెక్టర్లు, 14 మంది ఉద్యోగులపై గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం సంగం డెయిరీ లోపలకు వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా.. వారిని డెయిరీ ఉద్యోగులు అడ్డుకున్నారు. ఈ తరుణంలో డెయిరీ ఉద్యోగులు, పోలీసుల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
అసలేం జరిగింది : ఈ నెల 15న సంగం డెయిరీ బయట రైతులు, కొందరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన జరిగంది. ఈ నేపథ్యంలో 15 మందిపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు విచారణ కోసం పోలీసులు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నం చేయగా ఉద్యోగులు అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా లోపలకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు.
అదే కేసులో శుక్రవారం ఉదయం 9 గంటలకు చేబ్రోలు, పొన్నూరు పోలీసులు డెయిరీ వద్దకు వచ్చారు. నిందితులు డెయిరీలో ఉన్నారని.. తనిఖీలు చేయాలని పోలీసులు చెప్పారు. లోపలికి వచ్చి తనిఖీలు చేయడానికి అనుమతి పత్రం చూపాలని డెయిరీ ఉద్యోగులు కోరగా.. పోలీసులు తిరస్కరించారు. దీంతో డెయిరీ సిబ్బంది పోలీసుల మధ్య దాదాపు రెండు గంటల పాటు వాగ్వివాదం నడిచింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ.. ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ కారణంతో పోలీసుల కేసు నమోదు చేశారు.