నాలుగు నెలలుగా రేషన్ బంద్ పెట్టిన డీలర్.. జనం ఏం చేశారంటే..!
Complaint About Ration Issue: రేషన్ దుకాణానికి వెళ్తే.. అక్కడ ఉన్న డీలర్ ఏం ఇస్తారు. బియ్యం, ఇతర నిత్యావసర సరుకులే కదా. కానీ ఆ రేషన్ దుకాణంలో నాలుగైదు నెలలుగా కొంతమందికి అసలు రేషన్ ఇవ్వడం లేదని.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్నాడని తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరులో.. రేషన్ దుకాణంలో ప్రజలకు సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ప్రజలు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత కొన్ని నెలలుగా రేషన్ దుకాణంలో బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలు పంపిణీ చేయడం లేదని.. రేషన్ కార్డు దారులు వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
నెలలో రెండు రోజులు మాత్రమే నలబై, యాభై కార్డు దారులకు బియ్యాన్ని అందిస్తున్నారన్నారు. అయితే మిగతా కార్డు దారులకు బియ్యం ఇవ్వడం లేదని తహసీల్దార్ అనిల్ కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. డీలర్‌ను గట్టిగా నిలదీస్తే బియ్యంకు సరిపడా డబ్బును చేతిలో పెట్టి వెళ్లిపోమంటున్నారని తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. రేషన్ దుకాణంలో బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వడం ఎంటని నిలదీశారు. ఆ డీలర్‌పై చర్యలు తీసుకుని తమకు సక్రమంగా నిత్యావసరాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.