Tractor Car Accident: రోగిని తీసుకెళ్తున్న కారుపై ట్రాక్టర్ బోల్తా.. ఆ తర్వాత.. - telugu breaking news
Tractor Car Accident In Gajapathinagaram: విజయనగరం జిల్లాలోని గజపతినగరంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నీలగిరి కర్రలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి కారుపై పడటంతో రోడ్డుపై ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ట్రాక్టర్లో ఉన్న నీలగిరి దుంగలు కారుపై ఒక్కసారిగా పడటంతో.. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయిపోయింది. మెంటాడ రూట్ నుంచి నీలగిరి దుంగలతో నిండిన ట్రాక్టర్.. రహదారి పైకి వస్తోంది. ఈ క్రమంలో గజపతినగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్దకు రాగానే అదుపు తప్పి.. విశాఖ నుంచి రాయ్పూర్ వెళ్తున్న కారుపై బొల్తా పడింది. ట్రాక్టర్లోని నీలగిరి దుంగలు పూర్తిగా కారుపై పడ్డాయి. దీంతో కారు ముందు భాగం పూర్తిగా అణిగిపోయింది. ఈ ఘటనలో కారులో ఓ రోగిని తరలిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవటంతో వారు ఊపీరి పీల్చుకున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో ప్రమాదం తప్పింది. నీలగిరి దుంగలు రోడ్డుపై చెల్లచెదురుగా రోడ్డుపై పడటంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీ ట్రాఫిక్జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కొంత సమయం వరకు ఇబ్బందులను ఎదుర్కోక తప్పలేదు.