Amaravati Farmers Protest: రాజధానిలో ఆర్5 జోన్‌ను నిరసిస్తూ కృష్ణాయపాలెంలో నిరాహార దీక్షలు
Amaravati Farmers Protest: అమరావతి రాజధానిలో ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణయపాలెంలో రైతులు నిరాహార దీక్షలు చేపట్టారు. రాజధాని ఐకాస జెండాను ఆవిష్కరించిన తర్వాత రైతులు, మహిళలు నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం తమ స్థలాలు పక్కనే పేదలకు భూములు కేటాయించాలని రైతుల డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని మాస్టర్ ప్లాన్‌లో రూపొందించినట్లు మూడు సెంట్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సెంటు స్థలంలో ఇంటి ప్లాన్ ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నించారు. ఇల్లు నిర్మించుకుంటే సెట్ బ్యాక్ పేరుతో ఖాళీ స్థలం ఉండాలని నిబంధన చూపించే అధికారులు.. పేదలకు ఇచ్చే సెంటు స్థలంలో ఎలాంటి ప్లాన్ తయారు చేస్తారని నిలదీశారు. ఆర్5 జోన్ రద్దయ్యేంతవరకు ఎన్ని రోజులైనా నిరాహార దీక్షలు కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్పారు.