Ganja: అల్లూరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత.. ఎన్ని కిలోలంటే.. - Ganja News Telugu
Heavily seized Ganja In Alluri District: అల్లూరి జిల్లాలో భారీ స్థాయిలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండగా ఈ భారీ మత్తు పదార్థం పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న ఇద్దర్ని అరెస్టు చేయగా.. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. చింతపల్లి సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం లోతుగడ్డ వంతెన వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో రాళ్లగడ్డ వైపు నుంచి లోతుగడ్డ బ్రిడ్జి వైపు ఓ స్కూటీపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు పోలీసుల తనిఖీలను గమనించి స్కూటీని అక్కడే వదిలి పారిపోయారు. అదే సమయంలో రెండు కార్లు వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్న ప్రాంతానికి సమీపాన వచ్చి ఆగాయి. కార్లలో ఉన్న వ్యక్తులు కూడా పోలీసులను గమనించి అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు కార్ల వద్దకు వెళ్లి తనిఖీ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నర్సీపట్నానికి చెందిన గొల్లిపిల్లి నవీన్, రుత్తల బోడకొండతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు కలిసి ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేశారు. దానిని రెండు భాగాలుగా విభజించి రెండు కార్లలో తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డారని ఆయన తెలిపారు. పట్టుబడిన వ్యక్తుల నుంచి రెండు వేల రూపాయల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. అంతేకాకుండా గంజాయి తరలింపునకు వినియోగిస్తున్న రెండు కార్లను, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.