జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీ - డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం - Road accidents in Andhra Pradesh
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 3:17 PM IST
Bus Collided With Lorry in Palnadu District :పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఎర్రకొండ సమీపంలోని 16వ నెంబర్ జాతీయ (NH 6) రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. చెన్నై నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై కుడి వైపు లైన్లో వేగంగా వెళుతుంది. అదే సమయంలో ఎడమవైపు లైన్లో వెళుతున్న లారీ ఒక్కసారిగా కుడివైపు లైన్లోకి రావడంతో బస్సు, లారీ ఢీ కొన్నాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రమాదంలో గాయపడిన వారిలో తాడేపల్లికి చెందిన వీరేంద్ర రెడ్డి, చెన్నైకి చెందిన స్కాట్ ముల్లర్, బస్సు డ్రైవర్ వీరశేఖర్, సిబ్బంది జాషువా ఉన్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను వేరే బస్సులో వెళ్లే ఏర్పాట్లు చేశారు. యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదం జరగడానికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు.