ప్రయాణిస్తున్న బస్సులో మంటలు - ప్రయాణికులకు ముచ్చెమటలు - నెల్లూరులో ఘటన - మంటల్లో చిక్కుకున్న బస్సు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 3:18 PM IST
Bus Catches in Fire at Nellore: నెల్లూరు నుంచి ముత్తుకూరు వెళ్తున్న ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో అందులోని ఉద్యోగులకు ముచ్చెమటలు పట్టాయి. వెంటనే ప్రమాదాన్ని పసిగట్టిన వారు ఆ బస్సు నుంచి తప్పించుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. నెల్లూరు నుంచి ఓ ప్రైవేటు బస్సు ముత్తుకూరులోని థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఉద్యోగులను తీసుకెళ్తోంది. అయితే ఈ బస్సు కాకుపల్లి సమీపంలోకి రాగానే అందులో పొగలు రావడాన్ని డ్రైవర్ గుర్తించారు. దీంతో అనుమానం కలిగి అతడు బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి.. ఏమైందో చెక్ చేశాడు. అదే సమయంలో అందులో ఉన్న ఉద్యోగులు పొగ రావడాన్ని గమనించారు. వెంటనే బస్సులోంచి కిందకు దిగారు. వారు కిందకు దిగిన మరుక్షణమే బస్సులో దట్టమైన పొగలతో.. మంటలు చెలరేగాయి. డ్రైవర్‌తో సహా అందరూ బస్సు నుంచి దూరం వెళ్లిన కొద్ది సమయంలోనే బస్సులో పూర్తిగా మంటలు విస్తరించాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే మంటలు చెలరేగి.. బస్సు పూర్తిగా ఆగ్నికి ఆహూతికావడం చూసిన ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు నుంచి అందరూ దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది.