కడప ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం - ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు - YSR District rtc bus stands News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 4:58 PM IST
Bus Accident at Kadapa RTC Bus Stand:ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. సోమవారం విజయవాడ బస్టాండ్‌లో ఓ ఆర్టీసీ బస్సు ప్లాట్‌ఫాంపైకి అతివేగంగా దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఆ ఘటన మరవకముందే మంగళవారం మరో బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కాకపోతే, ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలవ్వడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
Officials on Kadapa Bus Stand Accident: కడప ఆర్టీసీ బస్టాండ్‌లో విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన ఘటన తరహాలో ప్రమాదం జరిగింది. కాకపోతే, ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..''వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు.. సంధ్య కూడలి వద్దకు రాగానే బ్రేకు పడటం లేదని డ్రైవర్ గుర్తించాడు. బస్సు నిలిపిస్తే ప్రయాణికులు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో.. నెమ్మదిగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోకి పోనిచ్చాడు. నేరుగా గ్యారేజ్‌లోకి తీసుకెళ్లకుండా పక్కన పార్కింగ్ చేద్దామని అనుకున్నాడు. ఇంతలోనే బ్రేక్ పని చేయకపోవడంతో.. ఎదురుగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై నిలబడి మాట్లాడుతుండగా.. వారిని ఢీకొట్టాడు. వారిద్దరూ కింద పడడంతో స్వల్ప గాయాలయ్యాయి'' అని ఘటన వివరాలను వెల్లడించారు. ఎక్కడైతే బ్రేక్ సమస్య వచ్చిందో అక్కడే బస్సు ఆపి ఉంటే ఇలా జరిగేది కాదని అధికారులు.. డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.