ఇకనుంచి పన్ను ఎగవేతలకు చెక్ - రాష్ట్రవ్యాప్తంగా 12 జీఎస్టీ సేవా కేంద్రాలు ఏర్పాటు - మంత్రి బుగ్గన తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 2:54 PM IST
Buggana Started GST Helping Centre in Vijayawada :రాష్ట్రవ్యాప్తంగా 12 జీఎస్టీ సేవాకేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. జీఎస్టీ ఎగవేతలను అరికట్టటంతో పాటు వ్యాపార, వాణిజ్య వర్గాలకు సేవలు అందుబాటులో ఉండేలా ఈ సేవా కేంద్రాలు ఏర్పాటు అయినట్టు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన ఉన్నతాధికారులతో కలిసి జీఎస్టీ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. కొందరు ఇన్పుట్ టాక్స్ (input tax) ఎగవేతలకు దొడ్డిదారులను ఎంచుకుంటున్నారని తద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని మంత్రి అన్నారు. జీఎస్టీ సేవా కేంద్రాల ద్వారా సులువుగా పన్నులు చెల్లించేందుకు, రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉందని మంత్రి అన్నారు. వ్యాపారాలు చేసేవారు పన్ను ఎగవేయడం కోసం అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. అలాంటి మోసాలు జరగకుండా ఉండటానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు జీఎస్టీ సేవాకేంద్రాన్ని ప్రారంభించామన్నారు. భారత దేశంలో ఈ సేవా కేంద్రాల పద్ధతి మూడు రాష్ట్రాలలో మాత్రమే ఉందని బుగ్గన తెలిపారు.