Bridge Washed Away: ఉద్ధృతంగా బుడమేరు.. కొట్టుకుపోయిన వంతెన - tdp leader devineni uma
Budameru Bridge Washed Away: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీ మంత్రులపై టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కందులపాడు వద్ద బుడమేరుపై బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీనిని టీడీపీ నేత దేవినేని ఉమ పరిశిలించారు. వైసీపీలో కొంత మంది అసమర్థులు మంత్రులుగా ఉండబట్టే ఈ ప్రాంతానికి ఈ ఖర్మ పట్టిందని మండిపడ్డారు. బుడమేరుపై ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోవడంతో.. దాని పక్కనే దశాబ్దాల కాలంగా ఉన్న బ్రిడ్జి ఉనికి ప్రశ్నార్థంగా మారిందన్నారు. ఆ బ్రిడ్జ్‌కి ఏ శాఖలు అనుమతులు ఇచ్చాయి.. ఎంత నిధులు మంజూరు చేశారు.. ఎంత నిధులు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. ఈ నిర్మాణం చేసిన వారిపై కేసులు పెట్టి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు అవినీతి దోపీడీలకు సమాధానమే ఈ బ్రిడ్జ్ అని.. దీనికి ఏమని చెప్తారని నిలదీశారు. కమిషన్లకు కక్కుర్తిపడి బుడమేరుపై బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జి కొట్టుకుపోవడంపై.. సీఎం జగన్, సంబంధిత మంత్రి.. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు.