BTech Ravi Fires on CM Jagan: ఇడుపులపాయలో సర్పంచ్ ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం జగన్కు లేదా..?: బీటెక్ రవి - idupulapaya sarpanch elections
BTech Ravi Fires on CM Jagan: ఇడుపులపాయ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి టీడీపీ మద్దతుదారులు నామినేషన్ వేస్తే వైసీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారనీ.. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ప్రశ్నించారు. వేంపల్లి ఎంపీడీవో మల్లిఖార్జున రెడ్డి తమ అభ్యర్థికి ధ్రువ పత్రాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంపీడీవో, స్థానిక సిబ్బంది వైఖరిపై కడప జెడ్పీ సీఈవో సుధాకర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. బీటెక్ రవితో పాటు పలువురు వేంపల్లె మండలం టీడీపీ నాయకులు జెడ్పీ సీఈవోను కలిసి వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలోనే సర్పంచ్ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక వైసీపీ నాయకులు అడ్డదారులు వెతుకుతున్నారని బీటెక్ రవి ఆరోపించారు. ఇంటి పన్నుల చెల్లింపు, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అధికారులు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. తమ అభ్యర్థి నామినేషన్ను పరిశీలనలో తిరస్కరించాలని చూస్తే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి జగన్కు ఉండదని వ్యాఖ్యానించారు. ఇడుపులపాయ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్న భయంతోనే నామినేషన్ తిరస్కరించేందుకు పన్నాగం పన్నుతున్నారని ఆక్షేపించారు.