British-era Paradi Bridge Fallen Into Disrepair: ప్రమాదపు అంచుల్లో బ్రిటిష్ కాలం నాటి వంతెన.. రాకపోకలకు అనుమతివ్వని పోలీసులు - Bobbili Paradi bridge on the brink of danger
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 12:53 PM IST
British-era Paradi Bridge Fallen Into Disrepair: విజయనగరం జిల్లాలో బొబ్బిలి వద్ద ఉన్న బ్రిటిష్ కాలం నాటి పురాతన వంతెన ప్రమాదపు అంచుల్లోకి చేరింది. చూడటానికి కూలిపోయే స్థితిలో ఉన్న ఆ వంతెనపై వెళ్ళేందుకు జంకే పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు, వాహనదారులు ఆ వంతెన మీద ప్రయాణాలు చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. వర్షాలు కూడా పడుతుండటంతో.. వంతెన మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. ఈ రోజు రాత్రి నుండి పారాది వంతెన నుండి ప్రయాణించడానికి ఎలాంటి వాహనాలను అనుమతించమని పోలీసులు ప్రకటించారు. వంతెనను పరిశీలించిన డీఎస్పీ.. ఇతర మార్గాల్లో రాకపోకలు సాగించాలని డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఒరిస్సా వెళ్లేందుకు ప్రధాన మార్గం అయినందున చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలకు కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీని వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. ఈ వంతెన నిర్మాణానికి 11 కోట్ల నిధులు మంజూరైనా అధికారుల నిర్వాకంతో పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఆ వంతెన మీద ప్రస్తుతం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. వంతెన నిర్మాణం చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.