Bopparaju Venkateswarlu Fire on YSRCP Govt: రెవెన్యూ ఉద్యోగులను కలెక్టర్లు ఒత్తిడి చేయడం భావ్యం కాదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు - APNGO Bopparaju Venkateswarlu comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 6, 2023, 10:29 AM IST
Bopparaju Venkateswarlu Fire on YSRCP Govt: కాకినాడ రెవెన్యూ భవన్‌లో జరిగిన రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ సర్వీస్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖకు సరిపడా నిధులు, సిబ్బంది, మౌళిక వసతులను కల్పించకుండా ఉద్యోగులపై తీవ్ర పని ఒత్తిడి మోపుతున్నారని బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bopparaju Comments: బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ..''రెవెన్యూ ఉద్యోగులపై రోజురోజుకు పనిభారం అధికమవుతోంది. ఉద్యోగులతో కొంత మంది కలెక్టర్లు ఇతర శాఖల పనులు కూడా చేయిస్తున్నారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇతర శాఖల పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు, సిబ్బంది మానసిక, ఆర్థిక ఒత్తిడిలతో సతమవుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. ఉద్యోగులు తీవ్ర అనారోగ్యంపాలై ఉద్యోగి కుటుంబం రోడ్డున పడుతుంది. రీ సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ, అది ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తయ్యేది కాదు. సరిపడా సమయం ఇవ్వకుండా భూముల రీ-సర్వే చేస్తే తప్పుడు దస్త్రాలు తయారవుతాయి. టెలీకాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్‌లకు సమయపాలన లేదు. ఒకదాని తర్వాత ఒకటి చేయించుకోవాలి. రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది. అక్టోబర్ 1న విజయవాడలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలి'' అని సంఘం బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.