ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది - బకాయిలు చెల్లించాలి : బొప్పరాజు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 7:06 PM IST

Bopparaju_Venkateswarlu_Fire_on_CM_Jagan

Bopparaju Venkateswarlu Fire on CM Jagan :వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు చట్టబద్ధంగా చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా వారి సహనాన్ని పరీక్షిస్తుందని అమరావతి ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ విశాఖలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బొప్పరాజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయకపోవడాన్ని తప్పు పట్టారు. రెవెన్యూ ఉద్యోగులకు ఇప్పటివరకు సర్వీస్ రూల్స్ లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ ఏరియర్స్, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోట్లాది రూపాయలు బకాయిలు ఇంకా అలాగే ఉంచడం సమంజసం కాదని బొప్పరాజు అన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటే తమను ఉద్యమాలు చేయమని ప్రభుత్వ ఉద్దేశమా అని ప్రశ్నించారు. ఉద్యోగులను ఉద్యమం వైపు నడిపించకుండా తమకు చట్టబద్ధంగా రావలసిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

AP JAC Amaravati Chief Bopparaju Venkateswarlu Serious On YSRCP Government :మున్సిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విశాఖలో ఓ మహాసభను ఏర్పాటు చేస్తున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 17 మున్సిపాలిటీల్లోని కార్పొరేషన్ ఉద్యోగులు అందర్నీ ఏకతాటి పైకి తీసుకొచ్చి సర్వీస్ అసోసియేషన్​గా ఏర్పడి మహాసభ నిర్వహించనున్నట్లు బొప్పరాజు చెప్పారు. గురజాడ కళాక్షేత్రం వేదికగా జనవరి 7వ తేదీ 2024న ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ ప్రథమ మహాసభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేరే వేరే క్యాటగిరిలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ల ఉద్యోగులు సంఘాలుగా ఏర్పడి తమ సమస్యలను పరిష్కరించుకోలేకపోవడం వల్లే ఉద్యోగులందరినీ ఏకం చేసి ఈ మహాసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మహాసభకు మున్సిపల్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని బొప్పరాజు కోరారు. 

ABOUT THE AUTHOR

...view details