Bonda Uma on CM Jagan: 'సునీత వ్యాఖ్యలు జగన్ నిజస్వరూపానికి నిదర్శనం' - సీఎం జగన్‌పై వర్ల రామయ్య వ్యాఖ్యలు
Bonda Umamaheswara Rao criticized CM Jagan: సొంత మనుషులు ఇంత క్రిమినల్ మైండ్‌తో ఉంటారని ఊహించలేకపోయానన్న సునీత వ్యాఖ్యలు జగన్ నిజస్వరూపానికి నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. దొరికిపోయిన దొంగల బండారాన్ని సీబీఐ బయటపెట్టినా.. జగన్ మౌనాన్ని వీడకపోవడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జగన్ చెల్లి షర్మిల, మరో చెల్లి సునీతల వాంగ్మూలాలు.. సీబీఐ తేల్చిన విషయాలతో ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయయాని అన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా జగన్ స్పందించడా అని ప్రశ్నల వర్షం కురిపించారు. సీబీఐ ఛార్జ్ షీట్‌లోని అంశాలపై జగన్ మౌనం అర్థాంగీకారమనుకోవాలా అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినాశ్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిన వారంతా తాడేపల్లి ప్యాలెస్ వదిలి జైలుకు వెళ్లాల్సిన సమయం వచ్చిందని దుయ్యబట్టారు.
వివేకా హత్య కేసులో వేసిన ఛార్జ్ షీట్లు మొత్తం వెనక్కు తీసుకుంటే.. 500కోట్లు ఇస్తామని సునీతకు ఆఫర్ ఇచ్చింది నిజమా.. కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. పులివెందులలో మెడికల్ కాలేజీ, భూములు, ఆస్తులు ఎరవేశారని ఆరోపించారు. అధికారంతో ఇన్నాళ్లు అవినాశ్ రెడ్డిని రక్షించిన జగన్, కొద్ది నెలల్లో సర్వం కోల్పోయాక ఏం చేస్తాడని నిలదీశారు.
సీఎం జగన్‌కు వర్ల సూచనలు: జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ముఖ్యమంత్రి పదవికున్న గౌరవాన్ని దిగజార్చకుండా హుందాగా వ్యవహరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. సభ్య సమాజం, మహిళలు, తలదించుకునేలా.. వ్యక్తిత్వ హననం రాజకీయాలు మానాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో సభ్యత, సంస్కారం ప్రతిబింభించేలా మాట్లాడాలని హితవు పలికారు.