'టీడీపీ మేనిఫెస్టోతో.. తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి'
Bonda Uma on TDP Manifesto: మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మహిళలకు ప్రకటించిన మేనిఫెస్టోపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహానాడులో చంద్రబాబు తొలి మేనిఫెస్టో ప్రకటించగానే తాడేపల్లిలో భూకంపం వచ్చిందని బొండా ఉమా అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో దెబ్బకు తాడేపల్లి పునాదులు కదిలిపోతున్నాయని.. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారన్నారు.
చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. 2 కోట్ల మంది మహిళలు చంద్రబాబు సీఎం అవ్వాలని ఎదురుచూస్తున్నారన్నారు. చంద్రబాబు చేసిన సంక్షేమం.. జగన్ చేసిన మోసకారి సంక్షేమంపై ఎవరితోనైనా తాము చర్చకు సిద్ధమని బొండా ఉమా సవాల్ చేశారు. కొడాలి నానితో చర్చించేందుకు గుడివాడైనా, తాడేపల్లి ప్యాలెస్కైనా రావడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
సంక్షేమంపై చర్చకు.. కొడాలి నాని ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామన్నారు. అధికారంలోకి రావడం కోసం సీఎం జగన్ సతీమణి భారతి కూడా అబద్ధపు హామీలు ఇచ్చిందన్నారు. సీఎం జగన్ పెంపుడు కుక్కలకి చంద్రబాబు మేనిఫెస్టో దెబ్బకు మైండ్ పోయిందన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు. వైసీపీ పతనానికి మహానాడులో పునాది పడిందని బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.