Boat Washed Away in Kolleru: కొల్లేరులో తప్పిన పెను ప్రమాదం.. 2 కిలోమీటర్లు కొట్టుకుపోయిన పడవ - boat washed away by flood flow in Kolleru lake
Boat Washed Away in Kolleru: విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కొల్లేరుకు భారీగా నీరు చేరుకుంటోంది. దీంతో గంట గంటకు కొల్లేరులో నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో ఏలూరు జిల్లా కైకలూరు మండలం కోమటిలంక వద్ద కొల్లేరులో పెను ప్రమాదం తప్పింది. 25 మంది మత్స్యకార కూలీలతో వెళ్తోన్న నాటు పడవ.. గోదావరి వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. కొంత మంది యువకులు ప్రాణభయంతో పడవ నుంచి దూకి తమను తాము కాపాడుకున్నారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం పడవ కొట్టుకుపోయింది. పడవ నడిపే వ్యక్తులు చాకచక్యంగా వ్యవహరించటంతో 25 మంది మత్స్యకారులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 25 మంది ప్రయాణికులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. కాగా వీరంతా ఏలూరు జిల్లా కైకలూరు మండలం గుమ్మల్లపాడు, చటాకాయ, ఆలపాడు, కొల్లేటికోట.. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన మత్స్యకారులు.. కోమటిలంకకు వచ్చారు. పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో నీటి ప్రవాహం అధికమై నాటు పడవ కొట్టుకుపోయింది.