BJP YSRCP Leaders Fight on Jagan pamphlets: కరపత్రాలపై జగన్ ఫొటో.. బీజేపీ, వైసీపీ నేతల వాగ్వాదం.. వీడియో వైరల్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 6:37 PM IST
BJP YSRCP Leaders Fight on Jagan pamphlets: అనంతపురం జిల్లా పాతూరులో పశు సంవర్థక శాఖ అధికారులు నిర్వహించిన సమావేశం వాగ్వాదానికి దారి తీసింది. సమావేశంలో పంచిన కరపత్రాలలో.. సీఎం జగన్ ఫొటో మాత్రమే ఉండటంపై బీజేపీ నాయకులు వైసీపీ నాయకులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వని పథకానికి జగన్ ఫొటో మాత్రమే ఎలా వేస్తారంటూ బీజేపీ నేతలు నిలదీశారు. దాంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు.. బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు.
అసలు ఏం జరిగిదంటే.. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (జాతీయ పశుసంపద మిషన్) పథకంపై పశుసంవర్థక శాఖ అధికారులు పాతూరులో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రైతులతో పాటు బీజేపీ, వైసీపీ నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న (గొర్రెలు, మేకలు, పందులు, కోళ్లు, 50 శాతం రాయితీ)పై అవగాహన కల్పించారు. ఈ పథకం కింద రైతులు 50 శాతం వాటాగా చెల్లిస్తే, మిగిలిన 50 శాతం రాయితీని కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని, ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అమలు చేసే ఏజన్సీగానే వ్యవహరిస్తోందని అధికారులు తెలిపారు. అయితే, సమావేశంలో వైసీపీ నేతలు పంచిన కరపత్రాలలో జగన్ ఫొటో మాత్రమే ఉండటంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంలేని పథకంపై జగన్ ఫొటోతో వైసీపీ నేతలు ఎలా ప్రచారం చేస్తారని నిలదీశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.