BJP Aadinarayana comments: 'వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసే పోటీ... జగన్ ఒక కలుపు మొక్క' - Former minister Adinarayana Reddy news
Former minister Adinarayana Reddy Comments: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయా..? లేదా..? అనే విషయంపై కొన్నాళ్లుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మూడు పార్టీల పొత్తుపై మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని అన్నారు.
కచ్చితంగా మూడు పార్టీలు కలుస్తాయి.. మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి కడప జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనల కలయిక కచ్చితంగా ఉంటుంది. మూడు పార్టీల పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తాం. ఈ విషయంపై కేంద్ర అధిష్టానం కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇటీవలే జరిగిన శ్రీకాళహస్తి, విశాఖ సభల్లో కూడా జేపీ నడ్డా, అమిత్ షా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గమైన పాలనను అంతమొందించడమే మా (మూడు పార్టీల) లక్ష్యం. ఎందుకంటే జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. జగన్ రెడ్డి ఎన్డీఏలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. కానీ, కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టమైన సంకేతాలు లేవు. జగన్ రెడ్డి లాంటి కలుపు మొక్కను చేర్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే జగన్‌నొక కలుపు మొక్క. తీసిపారేస్తారు గాని పెంచుకోరు.'' అని ఆదినారాయణ రెడ్డి అన్నారు.