Somu Veerraju criticized CM Jagan: ప్రధాని మోదీ గొప్పతనం ప్రజలకు తెలియకూడదని సీఎం జగన్ దుర్బుద్ధి : సోము వీర్రాజు
Somu Veerraju criticized CM Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుంచిత ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. సీఎం బటన్ నొక్కే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలేనని.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులా ఈ పథకాలు ప్రజల ముందుకు దూసుకొస్తున్నాయన్నారు. కానీ, ప్రధాని మోదీ గొప్పతనం ప్రజలకు తెలియకూడదనే దుర్బుద్ధితో సీఎం తన స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 2.26 కోట్ల మందికి రేషన్ బియ్యం అందిస్తున్నామని తెలిపారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ రాష్ట్రస్థాయి కన్వీనర్ ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి వీర్రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని- కేంద్ర పథకాల విషయంలో మార్గదర్శకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. సీఎంకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు పెద్దపీట వేస్తే... రాష్ట్రంలో మాత్రం పిల్లలకు ఆంగ్లం చెప్పించేందుకు ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి శిక్షణ ఇప్పిస్తామంటున్నారన్నారు. పాలనను సేవ బాధ్యతగా ప్రధాని మోదీ భావిస్తున్నారని చెప్పారు. బీజేపీ ఒక వ్యక్తికి మేలు చేయడానికి పని చేయదని.. దేశానికి, సమాజానికి మేలు చేయడాన్ని బాధ్యతగా భావిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరువ చేసి బీజేపీని రాష్ట్రంలో బలపరిచేలా న్యాయవాదులు కృషి చేయాలని కోరారు.