అప్పులు చేస్తూ ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారు: పురందేశ్వరి - వైసీపీ వర్స్స్ టీడీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 4:54 PM IST
Daggubati Purandeswari Anakapalle Tour: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె... మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని.. కానీ, సీఎం జగన్ అభివృద్ధి పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలు పాల్పడడం పైనే దృష్టి సారిస్తున్నారని పురందేశ్వరి విమర్శించారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై బెదిరింపు ధోరణితో పాలన కొనసాగిస్తున్నారని దుయ్య బట్టారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ప్రకటించిందని.. నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ కనీసం స్థలం కూడా కేటాయించకుండా... నిర్లక్ష్యం వహిస్తుందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఇళ్లను కేటాయించిందని.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని పురందేశ్వరి ఆరోపించారు. బొజ్జన్నకొండ బౌద్ధారామం అభివృద్ది కోసం కేంద్రం ఏడు కోట్లు కేటాయించిందని, అనేక రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలు చేసిందని తెలిపారు. ప్రతిపక్షాలుగా ప్రశ్నిస్తే కోవర్టులని ఆరోపిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చే నిధులను విషయంలో కేంద్రం ఎక్కడా వివక్ష చూపలేదని తెలిపారు. రాష్ట్రం అప్పులు చేస్తూ.. ఆ అప్పుల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని పురందేశ్వరి ఆరోపించారు.