BJP Purandeshwari Fires on Udayanidhi Stalin: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉదయనిధి వ్యాఖ్యలు : పురందేశ్వరి - BJP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2023, 3:59 PM IST
BJP Purandeshwari Fires on Udayanidhi Stalin : భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన తమిళనాడు మంత్రి ఉదయ్‌స్టాలిన్, సనాతన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి తన ఆకాంక్షను వ్యక్తం చేయడం హేయమైన చర్య అని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. మంత్రి ఉదయ్ స్టాలిన్ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. తమిళనాడులోని హిందూ మతపరమైన, ధర్మాదాయ సంస్థలకు బాధ్యత వహించే శేఖర్ బాబు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండడాన్ని దేనికి సంకేతమని నిలదీశారు. సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడమే కూటమి ఉద్దేశమని అన్నారు.
ఈ చర్యలు భారతదేశంలోని హిందూ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయని పురందేశ్వరి వాపోయారు. విపక్ష కూటమి ఇండియా (Opposition Alliance INDIA) అని పేరు పెట్టుకోవడానికి కనీస నైతిక హక్కు ( Moral right ) కూడా వీరికి లేదని దుయ్యబట్టారు. 2010 సంవత్సరంలో హిందూ సంస్థలను లష్కరే తోయిబా (Lashkar-e-Toiba) సంస్థతో రాహుల్ గాంధీ పోల్చి మాట్లాడడం అత్యంత దారుణమని గుర్తు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇండియా కూటమిలోని నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఉదయినిధిని సమర్థిస్తూ.. కార్తీక్ చిదంబరం చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి తీవ్రంగా మండిపడ్డారు.